సందీప్ రెడ్డి వంగా సమర్పణలో కొత్త తరహా రొమాంటిక్ ఎంటర్టైనర్
హైదరాబాద్: ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి ఇంటెన్స్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల కాగా.. సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
సందీప్ రెడ్డి వంగా సినిమాల తరహా హింసాత్మక అంశాలకు భిన్నంగా ‘రోమాంచకం’ ట్రైలర్‌ను పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందించారు. డేటింగ్ యాప్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో పాటు కామెడీ, ఫ్రెండ్షిప్, అనూహ్య పరిణామాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
కథ ఏంటంటే..
ఇవి కూడా చదవండి
డేటింగ్ యాప్ స్టార్టప్ నిర్వహించే యువకుడు తన వ్యాపారానికి సంబంధించిన పరిశోధనలో భాగంగా చెన్నైకి చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత తన స్నేహితుల గ్యాంగ్‌తో కలిసి హీరో చేసే పనులు ఊహించని పరిణామాలకు దారితీస్తాయి.
ట్రైలర్‌లోని కామెడీ సన్నివేశాలు, యువతను ఆకట్టుకునే డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “రాస్తే రామాయణం.. తీస్తే రోమాంచకం” అనే డైలాగ్ ట్రైలర్లో హైలైట్‌గా మారింది.
‘మేమ్ ఫేమస్’తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా నటించగా, అనంతిక హీరోయిన్గా కనిపించనుంది. వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిర్మాణ విలువలు, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించేలా క్లీన్ రొమాంటిక్ కామెడీగా సినిమాను రూపొందించినట్లు చిత్రబృందం చెబుతోంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
‘రోమాంచకం’ సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


