శాఖలపై మంత్రులకు పూర్తి అధికారం ఉండాలి.. లేకపోతే ప్రభుత్వానికే సమస్యలంటూ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి క్యాబినెట్లోని మంత్రులకు తమ శాఖలపై పూర్తి స్వేచ్ఛ, అధికారం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు తమ శాఖల వ్యవహారాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని సూచించారు.
మంత్రులకు తగిన స్వేచ్ఛ లేకపోతే భవిష్యత్లో అనేక సమస్యలు తలెత్తి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూనంనేని హెచ్చరించారు.
సీఎంపై వ్యక్తిగత విమర్శలు వద్దు
ఇవి కూడా చదవండి
సీఎం రేవంత్రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపైనా కూనంనేని స్పందించారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై రాజకీయ విమర్శలు చేయడం సహజమేనని అన్నారు. అయితే వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు.
రాజకీయ నాయకులు విధానాలపైనే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని, వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని కూనంనేని పేర్కొన్నారు.
భూముల నిషేధిత జాబితాపై ఆందోళన
రాష్ట్రంలో భూముల సమస్యపై కూడా కూనంనేని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు కోటి ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. దీంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూనంనేని కోరారు.


