హైదరాబాద్: నగరవాసులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 1 నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో నైట్ బస్సు సర్వీసులను పునఃప్రారంభించింది. రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఐటీ, హాస్పిటాలిటీ రంగాల్లో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ కారిడార్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను కలుపుతూ మొత్తం 15 బస్సులతో సర్వీసులను ప్రారంభించారు. ప్రయాణికుల స్పందన, డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో మరిన్ని రూట్లకు విస్తరించనున్నారు.
గతంలో ‘నైట్ రైడర్స్’ పేరుతో ఇలాంటి సర్వీసులను ఆర్టీసీ నిర్వహించినప్పటికీ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నిలిపివేసింది. ప్రస్తుతం రాత్రి షిఫ్ట్ ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం నడిచే 6 రూట్లు
222A: కోఠి–పటాన్చెరు (అబిడ్స్, లక్డీకాపూల్, కొండాపూర్ మీదుగా) — ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు
218: అఫ్జల్‌గంజ్/సీబీఎస్–పటాన్చెరు (కోఠి, కేపీహెచ్‌బీ, మియాపూర్ మీదుగా)
219: సికింద్రాబాద్–పటాన్చెరు (ప్యారడైజ్, కూకట్పల్లి, హైటెక్ సిటీ మీదుగా)
290U: హయత్‌నగర్–సికింద్రాబాద్ (ఎల్బీ నగర్, నాగోల్, తార్నాక మీదుగా)
195W: బాచుపల్లి–వేవ్‌రాక్ (ఐటీ క్యాంపస్‌ల మీదుగా)
10H: కొండాపూర్–సికింద్రాబాద్
రాత్రివేళ ప్రయాణికులకు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సౌకర్యాన్ని అందించడంతో పాటు యాప్ ఆధారిత క్యాబ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
నైట్ బస్సులపై మరింత సమాచారం కోసం 99592 26160 నంబర్‌ను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ సూచించింది.


