•కొత్తగూడెం విమానాశ్రయ కలకు రెక్కలు
•సెప్టెంబరు 7న క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర సాంకేతిక బృందం
•నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాలపై లోతైన అధ్యయనం
•నివేదిక అనుకూలిస్తే తక్షణణమే తదుపరి చర్యలు
•కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ
ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్: 1,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 7న కేంద్ర సాంకేతిక బృందం తెలంగాణలో పర్యటించనుంది. నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రన్వే నిర్మాణానికి అనుకూలత, భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, భూసేకరణ తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది.
ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిసి కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను, విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లాకు కలిగే రవాణా, పారిశ్రామిక, పర్యాటక ప్రయోజనాలను కేంద్ర మంత్రికి వివరించారు.
ఇవి కూడా చదవండి
గత అడ్డంకులు.. కొత్త ఆశలు..
గతంలో గుర్తించిన రెండు ప్రాంతాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలడంతో, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొత్తగా నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రాంతాల్లో భూసేకరణ సౌలభ్యం, రన్వే నిర్మాణానికి అనువైన భూభాగం, వాతావరణ పరిస్థితులు వంటి కీలక అంశాలను నిపుణుల బృందం నిశితంగా అధ్యయనం చేయనుంది.
ఢిల్లీ వేదికగా కీలక భేటీ..
ఈ పరిణామాలపై మంగళవారం న్యూఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి సవివరంగా తీసుకెళ్లారు. జిల్లా అభివృద్ధిలో విమానాశ్రయం పోషించే పాత్రను, స్థానికుల రవాణా అవసరాలను మంత్రి తుమ్మల వివరించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన వెంటనే విమానాశ్రయం ఏర్పాటుకు తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.


