జగిత్యాల: ఉక్రెయిన్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
ఉపాధి కోసం సుదర్శన్ గౌడ్ నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. స్వగ్రామంలో షట్టరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించిన ఆయన.. ఉక్రెయిన్లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రష్యా సైన్యం కీవ్తో పాటు పలు నగరాలపై క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు చేసింది. ఈ సమయంలో సుదర్శన్ తన నివాస గది నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జరిగిన క్షిపణి దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ దాడుల్లో సుదర్శన్తో పాటు మరో 11 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్లోనే ఉంటున్న సమీప తాటిపల్లి గ్రామానికి చెందిన వేణు ద్వారా సుదర్శన్ మృతి విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తమ ఆప్తుడు యుద్ధ దాడిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


