హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పనితీరును వివరించారు. ఆర్థిక ఇబ్బందులు, గత ప్రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు.
సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ఇప్పటివరకు రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వరి సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తున్నామని, దీంతో తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానానికి చేరిందని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులు, బకాయిలను కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రి తెలిపారు. సర్పంచ్ల బకాయిలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పెండింగ్ నిధులను సైతం విడుదల చేస్తున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
పేదలకు రేషన్ కార్డుల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. త్వరలో మరో 3 లక్షల మందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేసిన పొంగులేటి.. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 ప్రశ్నాపత్రాల వ్యవహారంపై ఆరోపణలు చేశారు. ధరణి వ్యవస్థకు సంబంధించిన భూములు, ఆస్తులపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. 22ఏ భూముల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా పొంగులేటి తప్పుబట్టారు. రాజకీయాల్లో హద్దులు దాటి మాట్లాడటం సరికాదని, ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరించరని అన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యారని మంత్రి విమర్శించారు.


