హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత వివాదాలకు అధిష్ఠానం ముగింపు పలికింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది. దీంతో సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సిఫారసు లేఖ పంపించారు.
సురేఖ స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు అంగీకరించకపోవడంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె కుమార్తె సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన వ్యవహారం.. పార్టీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. అనంతరం అధిష్ఠానం చర్చించి సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
చిన్నారెడ్డిపై కూడా వేటు
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
చిన్నారెడ్డి స్థానంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది.
కీలక పదవుల్లో కొత్త నియామకాలు
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు వెలువడ్డాయి.
సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాలపై గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర పార్టీ నాయకత్వం మధ్య చర్చలు కొనసాగాయి. చివరకు ఇద్దరిపై చర్యలకు నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.


