సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు
నూతనకల్: ఎర్రబాడు ప్రాంతంలో దొరల ఆధీనంలో ఉన్న భూములను పేదలకు పంచాలని సీపీఎం ఆధ్వర్యంలో సంవత్సరాలుగా సాగించిన భూపోరాటాల ఫలితంగానే నేడు పేద రైతులకు భూమి పట్టాలు అందుతున్నాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.
నూతనకల్లోని తొట్ల మల్సూర్ భవన్లో నూతనకల్, మద్దిరాల మండలాల ఉమ్మడి మండల కమిటీ సమావేశం కల్లేపల్లి భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో శిల్పకుంట్ల, ఎర్రబాడు, మిర్యాల, పొలుమల్ల గ్రామాలతో పాటు మరో 14 గ్రామాలలో పేదల భూమి హక్కుల కోసం సీపీఎం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. భూములపై నాగళ్లు దున్ని భూపోరాటాలు చేయడంతో పాటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టామని, ఈ పోరాటాల్లో అనేక మంది నాయకులు జైలు పాలయ్యారని తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం స్పందించి రైతులకు పట్టాలు అందించడం అభినందనీయమన్నారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నిరంతరం పోరాడుతుందని, భవిష్యత్ ఉద్యమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం నూతనకల్ మద్దిరాల మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, పోలోజు సైదులు, మండల కమిటీ సభ్యులు శిల్పకుంట్ల ఉప సర్పంచ్ సామ సురేందర్ రెడ్డి, బత్తుల జనార్ధన్, కుసు సైదులు, తొట్ల లింగయ్య, బత్తుల తిరుమలేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


