ప్రముఖ కవి రచయిత చిమ్మపూడి శ్రీరామ మూర్తికి
భోగోజు సముద్రమ్మ -పురుషోత్తం స్మారక పురస్కార ప్రదానం
-కథల కవితల సంకలనం ఆవిష్కరణ
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్, 6:

వురిమళ్ళ ఫౌండేషన్ 8వ వార్షికోత్సవ సందర్బంగా ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్లో ఆదివారం నిర్వహించిన పురస్కారాల పండుగ వైభవంగా వేడుకగా జరిగింది. తొలుత భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం, వురిమళ్ళ శ్రీరాములు, పద్మజ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దాసరోజు శ్రీనివాస్ అధ్యక్షతన కథలు, కవితల పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం స్మారక పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త చిమ్మపూడి శ్రీరావుమూర్తికి వురిమళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు వురిమళ్ల సునంద, భోగోజు ఉపేందర్రావు అందచేశారు. అనంతరం కథల పుస్తకాన్ని నామా పురుషోత్తం పరిచయం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు, ప్రముఖ కవి, విమర్శకులు ప్రసేన్ మాట్లాడుతూ నిర్విఘ్నంగా సాహిత్య సేవ చేయడం ప్రశంసనీయ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కథలు కవితలు పోటీలు నిర్వహించి నగదు బహుమతి ఇవ్వడమే కాకుండా వారి రచనలను పుస్తకంగా తీసుకరావడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా బాల సాహిత్యాన్ని ప్రోత్సాహిస్తూ విద్యార్థుల రచనలు పుస్తకంగా తీసుకువచ్చి వారిచేత ఆవిష్కరించడం గొప్ప విషయం అన్నారు. కాళోజి అవార్డు గ్రహీత సీతారాం, ప్రముఖ రచయిత్రి కొండపల్లి నిహారిణీ, బాలసాహితి వేత్త మధుసూదన్ రాజు, ఎస్వి యూనివర్సిటీకి చెందిన బ్రహ్మనందరెడ్డి, ప్రముఖ సామాజిక వేత్త పారుపల్లి ఝాన్సీ, సామాజిక చైతన్య వేదిక సుమతి తదితరులు సభనుద్దేశించి మాట్లాడుతూ వురిమళ్ల ఫౌండేషన్ సేవలను కొనియాడారు. అనంతరం కథల, కవితల విజేతలకు నగదు పురస్కారాలు అందచేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కవులు స్పందన తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షరాలతోవ నిర్వాహకులు నామా పురుషోత్తం రాచమ ళ్ల ఉపేందర్ ఖమ్మం సాహితీ మిత్రులు పాల్గొన్నారు.


