నూతన క్యూ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన
చింతకాని మండల పరిధిలోని వందనం గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ నిధులతో రూ.1,35,000 వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్ శంకుస్థాపన చేశారు.వందనం గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావుతో కలిసి గోపి యాదవ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్రమపద్ధతిలో వెళ్లేందుకు వీలుగా ఆలయం చుట్టూ స్టీల్ రాడ్లతో క్యూ లైన్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు దర్శన సమయంలో సౌకర్యం కలగనుంది.ఈ సందర్భంగా గోపి యాదవ్ మాట్లాడుతూ, చారిత్రక ప్రాధాన్యత కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం సంతోషకరమన్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిధులతో చేపడుతున్న క్యూ లైన్ నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.కాగా, కార్యక్రమం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలకు చెందిన కొందరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం గమనించిన గోపి యాదవ్ వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల గోవిందరావు, చింతకాని మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె. పాషా, కురపాటి కిషోర్, కంసాని శంకర్, అమర్లపూడి శీను, ఆవుల సైదులు, ఎస్.కె. మోహిన్, కొండ దుర్గా శంకర్, పొన్నం శంకర్రావు, ఆవుల కృష్ణయ్య, గురక వెంకట్ రెడ్డి, కొల్లి ప్రసాద్, జర్నలిస్ట్ పాషా, ఆలయ పూజారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.