దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు..
అధికారుల మీద నెపం నెట్టి పబ్బం గడుపుకుంటున్న రేవంత్ రెడ్డి
వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టి 22A పేరుతో వ్యవసాయ రంగాన్ని రియల్ ఎస్టేట్ రంగంగా మార్చే దిశలో రేవంత్ రెడ్డి
వెంటనే నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకోకపోతే జాతీయ రహదారులు స్తంభింపచేస్తం, సబ్ స్టేషన్ లను ముట్టడిస్తాం
_ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట, సెప్టెంబర్ 20:రాష్ట్రంలో పాలన చేతగాక, సంక్షేమం అందించలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నడిగూడెం మండలం కరివిరాల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కరెంటు కోతలకు నిరసనగా రైతులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీసం వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. అధికారులను నామమాత్రం చేసి, ప్రభుత్వం మీద ఉన్న నెపాన్ని క్షేత్ర స్థాయి ఉద్యోగుల మీదకు నెడుతూ రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న అధికారులకు రైతుల పట్ల మానవత్వం ఉందని, వారు సహాయం చేద్దామనుకున్నా పైనుంచి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్పష్టం చేశారు. రైతులు బోర్లు, బావుల కింద వేసుకున్న పంటలు నాణ్యమైన విద్యుత్ లేక కళ్ల ముందే ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కన్నీరు పెడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, చెవిటోని ముందు శంఖం ఊదినట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రతిపక్షంగా తాము ముల్లు కర్ర పెట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం మేల్కొనేలా లేదని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోతే కేవలం అధికారులను అడ్డుకోవడమే కాకుండా, జాతీయ రహదారులను స్తంభింపజేస్తామని మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులను ఆదుకోవడమే తమ ఏకైక లక్ష్యమని, అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని తేల్చి చెప్పారు.