ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో ఇద్దరు శిశువులు మృతి.
పొగతో శ్వాస ఆడక 15 రోజుల మరో శిశువు కూడా మరణించింది.
సీఎం రేవంత్ రెడ్డి విచారం, విచారణ, మెరుగైన వైద్యానికి ఆదేశాలు.
మంత్రి జూపల్లి విచారం, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది. పొగ వ్యాపించి శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ ఇచ్చోడకు చెందిన ఓ శిశువు మృతి చెందగా.. మరికొందరిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరో శిశువు మృతి చెందింది. తాజాగా ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెర గ్రామానికి చెందిన కుమ్ర శెకుబాయి దినేష్ దంపతుల 15రోజుల నవ జాత శిశువు సైతం చెందినట్లు కుటుంబ సభ్యులు abp దేశంకు వివరించారు.అగ్ని ప్రమాదం జరగగానే తమ శిశువును బయటకు తీసుకొని రాగా శ్వాస ఆడక మృతి చెందిందని, ఆపై వారు తమ గ్రామానికి తిరిగి వెళ్లారు. వారి స్వగ్రామమైన గిన్నెర గ్రామానికి చేరుకోగా ఈ విషయం తెలుసుకొని అధికారులు రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు వారిని ఓ వాహనంలో మృతి చెందిన శిశువును తీసుకొని రిమ్స్ ఆసుపత్రికి బయలుదేరారు. ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన, అస్వస్థతకు గురైన మరికొందరు చిన్నారులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
రిమ్స్ చిన్నారుల మృతి.. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మరణించడం బాధాకరం అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
రిమ్స్ అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: మంత్రి జూపల్లి దిగ్భ్రాంతి
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాద ఘటనటనపై జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులకు మంత్రి జూపల్లి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
అవసరమైన అన్ని వైద్య సేవలను తక్షణమే అందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలన్నారు.