ప్రకృతిలో కొన్ని జీవుల జీవన ప్రయాణం మన ఊహకు అందనంత వేగంగా సాగుతుంది. పుట్టడం, పెరగడం, సంతానోత్పత్తి చేయడం, చనిపోవడం.. మొత్తం జీవచక్రం కొన్ని నిమిషాలు లేదా కొన్ని నెలల్లోనే పూర్తవుతుంది.
5 నిమిషాల జీవితం
మేఫ్లైలోని కొన్ని జాతుల ప్రౌఢ దశ కేవలం కొన్ని నిమిషాలే ఉంటుంది. నీటిలో ఎక్కువకాలం గడిపిన తర్వాత బయటకు వచ్చి, జతకట్టి గుడ్లు పెట్టడం పూర్తయిన వెంటనే వాటి జీవితం ముగుస్తుంది.
59 రోజులకే ముగింపు
పిగ్మీ గోబీ అనే చిన్న సముద్రపు చేప వెన్నెముక ఉన్న జీవుల్లో అతి తక్కువ ఆయుష్షు కలిగిన వాటిలో ఒకటి. దీని జీవితం సుమారు రెండు నెలల్లోపే పూర్తవుతుంది.
వర్షాకాలంతో మొదలై.. పొడి కాలంతో ముగింపు
మడగాస్కర్కు చెందిన లాబోర్డ్స్ ఊసరవెల్లి జీవితం రుతువులతో ముడిపడి ఉంటుంది. వర్షాలు మొదలయ్యాక గుడ్ల నుంచి బయటకు వచ్చి వేగంగా పెరిగి సంతానోత్పత్తి చేస్తుంది. పొడి కాలం వచ్చేలోపే దాని జీవితం ముగుస్తుంది.
నీరు ఉన్నంతకాలమే జీవితం
టర్కోయిస్ కిల్లిఫిష్ తాత్కాలిక నీటి కుంటల్లో జీవిస్తుంది. నీరు ఎండిపోయేలోపే పెరిగి సంతానోత్పత్తి చేయడం ఈ చేప ప్రత్యేకత.
ఇలాంటి స్వల్పకాలిక జీవితం వాటికి లోపం కాదు. పర్యావరణ పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా ఎదిగి, సంతానాన్ని అందించడం ద్వారా తమ జాతిని కొనసాగించేందుకు ప్రకృతి వాటికి ప్రత్యేకమైన జీవన విధానాన్ని అందించింది.