భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం ఎలా మారనుంది? వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి సాంకేతికత అవసరం? ఈ అంశాలపై అమెరికా రక్షణ శాఖ భారీ కసరత్తు ప్రారంభించింది.‘ప్రాజెక్ట్ మెరిడియన్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎలాన్ మస్క్, ఆండ్యూరిల్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీ, అమెరికా మాజీ ప్రతినిధుల సభ స్పీకర్ న్యూట్ గింగ్రిచ్ నేతృత్వం వహించనున్నారు. 120 రోజుల్లోగా భవిష్యత్తు యుద్ధాలకు అవసరమైన సాంకేతికత, ఆయుధ వ్యవస్థలు, సైనిక సామర్థ్యాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.భూగర్భ ప్రాంతాల నుంచి భూమి, చంద్రుడి మధ్య అంతరిక్షం వరకు ఎదురయ్యే సవాళ్లను ఈ ప్రాజెక్టు అధ్యయనం చేయనుంది. ముఖ్యంగా స్వయంప్రతిపత్తితో పనిచేసే యుద్ధ వ్యవస్థలు, అధునాతన రక్షణ సాంకేతికతపై దృష్టి పెట్టనున్నారు.ఇదే సమయంలో సైనిక స్థావరాల భద్రత, కీలక విడిభాగాల దేశీయ తయారీ కోసం ‘ఫోర్ట్రెస్ అమెరికా’ కార్యక్రమాన్ని కూడా అమెరికా చేపట్టనుంది. అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, స్వయం సమృద్ధి విద్యుత్ సదుపాయాలతో కొత్త సైనిక స్థావరాల ఏర్పాటుపైనా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.సాంకేతిక రంగంలో ఎలాన్ మస్క్కు ఉన్న అనుభవం, రక్షణ రంగంలో పామర్ లక్కీ పరిజ్ఞానం, గింగ్రిచ్కు ఉన్న రాజకీయ-వ్యూహాత్మక అనుభవాన్ని ఈ ప్రాజెక్టులో వినియోగించుకోనున్నారు.