: హైదరాబాద్ నగరంలోదాదాపు రెండు కోట్ల మంది జనాభా ఉన్నారు. అయితే ఎల్ నినో ప్రభావంతో ఈసారి తాగునీటి ఎద్దడి నెలకొంది. అయినప్పటికీ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని కేవలం తాగునీటినే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జల మండలి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వాసులకు తాగు నీటి కోసం ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నీటి వృధాను అరికట్టాలని నిర్ణయించారు. అలాగే ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. గొంతు తడుపుకునేందుకు మాత్రమే తాగు నీటిని వినియోగించాలని, ఇతర అవసరాలకు ఏ మాత్రం తాగునీటిని వినియోగించినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నల్లా కనెక్షన్ కట్ చేస్తామని...
హైదరాబాద్లో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి నడుంబిగించింది. తాగునీటిని వృథా చేసే వారిపై భారీ జరిమానాలు విధించాలని మరియు పునరావృతమైతే నల్లా కనెక్షన్లు తొలగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. జలమండలి అధికారులు జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో నీటి సరఫరా వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.భారీ జరిమానాలు: తాగునీటిని రోడ్లు కడగడానికి, కార్లు కడగడానికి లేదా ఇతర అనవసర అవసరాలకు వృథా చేస్తున్న వినియోగదారులను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఒకసారి జరిమానా విధించినా నిర్లక్ష్యం వీడి రెండోసారి కూడా నీటిని వృథా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యగా నల్లా కనెక్షన్లను తొలగించనున్నారు. హైదరాబాద్ లో ఉండే వారు మాత్రమే కాకుండా రోజుకు లక్షల మంది జనం వస్తుండటంతో వారి దాహార్తిని తీర్చాలంటే అవసరమైన నీటిని అందించాలని ముందస్తు చర్యలను చేపట్టింది. కోట్లాది మందికి తాగు నీరు అందించాలంటే ఆషామాషీ కాదు. అందుకే చర్యలు ప్రారంభించింది.
నీటి కొరతకు కారణాలివే...
ఎల్ నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, మరియు జలాశయాలలో నీటి మట్టాలు తగ్గడం వల్ల నగరంలో తాగునీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాలని జలమండలి బోర్డు స్పష్టం చేస్తోంది. ప్రజలు నీటిని వృథా చేయకుండా బాధ్యతగా ఉండాలని, లీకేజీలను అరికట్టాలని కోరుతున్నారు. పైపులైన్ల నుంచి తాగు నీరు వృధా కాకుండా పహారా కాస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లోనూ పెద్దగా నీరు లేదు. మంజీరా నదిలోనూ పెద్దగా నీరు లేకపోవడంతో పాటు ఇక వృధా అయితే మరింత తాగు నీటి సమస్య ఎదురవుతుందని భావిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వానలకు కొంత భూగర్భ జలాల నీటిమట్టం పెరగడంతో కొంత ఊరట అని చెప్పాలి. ఇక హోటళ్లు, చిన్న చిన్న పరిశ్రమలకు కూడా నీరు అందించాల్సిన పరిస్థితుల్లో జలమండలికి మాత్రం తాగునీటి సరఫరా సవాల్ గా మారిందనే చెప్పాలి.