అమరావతి: బంగాళాఖాతంలో అక్టోబర్ 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది మరింత బలపడి అక్టోబర్ 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో వర్షపాతం లోటుతో ఉన్న ఏపీలో ఈ వాతావరణ వ్యవస్థపై ఆసక్తి నెలకొంది.
అధికారుల అంచనా ప్రకారం.. అక్టోబర్ 12న ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడొచ్చు. దాని ప్రభావంతో మరుసటి రోజే అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వ్యవస్థ పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉంది.
ఇక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో ఏపీకి వర్షాలు తక్కువగానే పడ్డాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సాధారణంగా 589.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. 383.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రంలో 34.9 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఏపీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? రాష్ట్రంలో వర్షాలు పెరుగుతాయా? అన్నది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాతావరణ వ్యవస్థ గమనం, తీవ్రతలో మార్పులు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.


