న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఎల్నినో మరింత బలపడుతోంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా అంచనాల ప్రకారం, ఈ ఎల్నినో 2026 చివర్లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది.
భూమధ్యరేఖకు సమీపంలోని మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అసాధారణంగా ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ ఉష్ణోగ్రతల వ్యత్యాసం 3.7 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చని WMO అంచనా వేసింది. ఇది గతంలో నమోదైన బలమైన ఎల్నినో స్థాయులను మించే అవకాశం ఉంది.
ఫిబ్రవరి వరకు ప్రభావం
ఇవి కూడా చదవండి
ఎల్నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉందని WMO తెలిపింది. దీని ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, వర్షపాతంలోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ముప్పు పెరగవచ్చు.
నిపుణులు ఈ పరిస్థితిని చాలా బలమైన ఎల్నినోగా పేర్కొంటున్నారు. అయితే దాని ప్రభావం ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా ఉండదని, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


