అర్థరాత్రి కరెంటుతో రైతులకు నరకం, పట్టపగలు దొంగతనాలు, వాగులో ఇసుక దోపిడీ!
అనంతగిరి , అక్టోబర్ 10(ఆర్యాద్వి): అనంతగిరి మండలం, కొత్తగూడెం గ్రామంలో నెలకొన్న సమస్యలపై రెవెన్యూ, పోలీస్, విద్యుత్ అధికారులు స్పందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. తమ గోడును తెలియజేస్తూ ఓ ఆడియోను విడుదల చేసి, ఆ ఆడియో ఒక్కసారి విని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

కొత్తగూడెం గ్రామస్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు:
ఇవి కూడా చదవండి
1. అర్థరాత్రి కరెంటుతో రైతుల అవస్థలు:
రైతులకు పగటిపూట కరెంటు ఇవ్వకుండా అర్థరాత్రి సమయంలో విద్యుత్ సరఫరా చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాములు, తేళ్ల భయంతో రాత్రి వేళ పొలాలకు వెళ్లి మోటార్లు ఆన్ చేయలేక నరకం అనుభవిస్తున్నామని రైతులు వాపోతున్నారు. పగటిపూట 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
2. గ్రామంలో వరుస దొంగతనాలు - నిద్రలేని రాత్రులు:
గ్రామంలో ఇటీవల బైక్ దొంగతనాలు, బంగారం దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల భయంతో రాత్రిళ్లు నిద్ర కూడా పోవడం లేదని, పోలీసులు రాత్రి గస్తీ పెంచి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.
3. అతి పెద్ద సమస్య - పాలేరు వాగులో ఇసుక దోపిడీ:
ఇదే గ్రామంలోని అతి పెద్ద సమస్య పాలేరు వాగు నుండి జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు. కొందరు అక్రమార్కులు పడవల సహాయంతో రాత్రికి రాత్రే పాలేరు వాగు నుండి ఇసుకను తోడేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు, బావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అక్రమ ఇసుక రవాణాను వెంటనే నిలిపివేసి, తమ పంటలను కాపాడాలని రైతులు రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నారు.
విద్యుత్, పోలీస్, రెవెన్యూ - మూడు శాఖల అధికారులు తమ గ్రామ సమస్య గురించి తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కొత్తగూడెం గ్రామస్తులు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారూ


