గొండ్రియాలలో వాటర్ ట్యాంక్ ఎక్కి రైతుల వినూత్న నిరసన - ఎండిన పొలంలో బైకులతో ఆందోళన
అనంతగిరి, అక్టోబర్ 10 (ఆర్యాద్వి): అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ ఇవ్వకపోవడంతో పంటలు కళ్లముందే ఎండిపోతుంటే చూస్తూ ఉండలేక రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి వినూత్న నిరసనకు దిగారు. "కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు చావే శరణ్యం" అంటూ నినాదాలు చేశారు.

పెట్టుబడి నీళ్లపాలు - ఎండిన పొలాల్లో బైకులతో నిరసన:
గొండ్రియాలలో రోజుకు 3-4 గంటలు కూడా కరెంటు సరిగా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన కరెంటు కూడా లో వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. దీంతో ఎకరాల పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయి. లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన పంట చేతికి అందకుండా పోతుండటంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బాధను ప్రభుత్వానికి తెలిపేందుకు ఎండిన పొలాల్లోనే ద్విచక్ర వాహనాలు నడుపుతూ, 12 గంటల నిరంతర త్రీ ఫేజ్ విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం:
ఎన్నికల ముందు అంతరాయం లేకుండా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక రైతులను పూర్తిగా మరిచిపోయిందని రైతులు మండిపడ్డారు. కరెంటు కోతలతో పాటు, అధికారులు పట్టించుకోకపోవడం, ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని, ఇదే పరిస్థితి కొనసాగితే పంటలతో పాటు రైతుల జీవితాలే ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే పరిష్కరించాలని డిమాండ్:
రైతుల నిరసనపై స్పందించిన గ్రామ పెద్దలు, వెంటనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని 12 గంటల నిరంతర త్రీ ఫేజ్ కరెంటును అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతామని, రహదారి దిగ్బంధం చేస్తామని రైతులు హెచ్చరించారు.


