అనంతగిరి అక్టోబర్ 13 (ఆర్యాద్వి): మండల పరిధిలోని వెంకట్రమాపురం గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించిన విషయం గ్రామ ప్రజలకు తెలియకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాటింపు వేయడం గానీ, మైక్ ద్వారా ప్రకటించడం గానీ లేకుండా గ్రామసభ నిర్వహించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామసభలో గ్రామ పంచాయతీ ఓటర్లందరూ సభ్యులే పాల్గొనే వేదికగా ఉండాల్సి ఉంది.
స్థానికుల ఆరోపణలు
గ్రామ పంచాయతీ నుంచి ఏ విధమైన అధికారిక సమాచారం లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ నిర్వహించడం జరిగిందని స్థానికులు తెలిపారు. సభ జరిగిన విషయం గ్రామంలో చాలామందికి తెలియకపోవడంతో ప్రజలు పాల్గొనే అవకాశం దక్కలేదని, ఇది గ్రామసభ ముఖ్యోద్దేశానికే విరుద్ధమని వారు విమర్శిస్తున్నారు. గ్రామసభలు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల భాగస్వామ్యంతోనే అర్థవంతంగా నిర్వహించాలని నిబంధనలు సూచిస్తున్నాయి.
ఈ విషయంపై గ్రామ కార్యదర్శి నాగలక్ష్మిని స్థానికులు ప్రశ్నించగా, “విద్యుత్ పరికరానికి ఛార్జింగ్ లేదు”, “గ్రామంలో చాటింపులు వేసేవారు లేరు” అంటూ జవాబిచ్చినట్లు తెలిసింది. అయితే, ప్రభుత్వ సమాచారం ప్రజలకు అందించడం పంచాయతీ వ్యవస్థ బాధ్యత అని, సాంకేతిక లోపాన్ని కారణంగా చూపడం సబబు కాదు అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యపై గ్రామస్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ్రామసభ అనేది ప్రజల సమస్యలు, పంచాయతీ నిధులు, అభివృద్ధి పనులపై బహిరంగంగా చర్చించే వేదిక కాగా, దానికి సంబంధిత సమాచారం లేకుండా నిర్వహించడం పారదర్శకతపై సందేహాలు రేపుతుంది.గతంలో కూడా సెలవు పెట్టకుండా హైదరాబాద్ వెళ్లిన ఘటన వార్తల్లోకి రావడంతో, కార్యదర్శి నాగలక్ష్మి వ్యవహరించే తీరుపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఈసారి కూడా ప్రజలకు సమాచారం అందించకుండా గ్రామసభ నిర్వహించిన తీరు పట్ల గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శి తీరు మారకపోతే గ్రామ పాలనపై ప్రజల నమ్మకం మరింత దెబ్బతింటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయమై సర్పంచ్ ను వివరణ అడుగగా:
గ్రామసభకు చాటింపు అవసరం లేదని కార్యదర్శి ఆదేశించినట్లు గ్రామ సర్పంచ్ జయరాజు తెలిపారు.