మత సంస్ధల బ్యానర్లు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
జాతరలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : సీపీఎం డిమాండ్
కారేపల్లి, అక్టోబర్ 14:
సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో దసరా సందర్భంగా జరిగే కోట మైసమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అలయ ప్రాంగణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే బ్యానర్లను ఏర్పాటు చేయటాన్ని సీపీఐ(ఎం) ఆక్షేపించింది. తక్షణమే తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఉసిరికాయలపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా వైభవంగా జరిగే కోట మైసమ్మ జాతరకు కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. అయితే, జాతరలో హలాల్ నిషేధమంటూ, అమ్మవారి నైవేద్యం అపవిత్రమవుతుందంటూ కొన్ని మత ఉన్మాద సంస్థల పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలు మత విద్వేషాలను పెంచుతాయని మతసామరస్య దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. అమ్మవారికి పాల పొంగళ్ళు, పులిహోర, దద్దోజనం వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారని, భక్తులు తమ తమ ఆచారాల ప్రకారం మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. జాతరలో మతపరమైన నిషేధాల పేరుతో వివాదాలు సృష్టించడం తగదని, ఇలాంటి చర్యలను సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సంబంధిత బ్యానర్లను తొలగించాలని, విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ పేర్లతో బ్యానర్లు కట్టిన బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జాతరను మతసామరస్యానికి ప్రతీకగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కే నరేంద్ర నాయకులు బానోత్ బన్సీలాల్, దాసరి మల్లయ్య, తేజావత్ చందర్, సైదులు, నరసయ్య, యాకేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు


