సాధారణంగా మనకు వీకెండ్ అంటే శని, ఆదివారాలు గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వారాంతపు సెలవులు భిన్నంగా ఉంటాయి. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, ప్రభుత్వ విధానాల ఆధారంగా అక్కడ సెలవుల రోజులు నిర్ణయిస్తారు.
సౌదీ అరేబియా, ఖతార్: ఈ దేశాల్లో సాధారణంగా శుక్ర, శనివారాలు వారాంతపు సెలవులు. ఆదివారం నుంచి గురువారం వరకు పని దినాలుగా ఉంటాయి.
బంగ్లాదేశ్: సాధారణంగా శుక్రవారం, శనివారాలు వారాంతపు సెలవులుగా పాటిస్తారు.
ఇవి కూడా చదవండి
బ్రూనై: ఇక్కడ శుక్రవారం, ఆదివారం సెలవులు కాగా.. శనివారం పనిదినంగా ఉంటుంది. దీంతో మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడి వీకెండ్ విధానం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
షార్జా: యూఏఈలోని షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి మూడు రోజుల సెలవులు ఉంటాయి. శుక్ర, శని, ఆదివారాలు విశ్రాంతి రోజులు కాగా, సోమవారం నుంచి గురువారం వరకు పని దినాలు.
మార్పుల వెనుక కారణాలివే!
శుక్రవారం ప్రార్థనలకు ఉన్న ప్రాధాన్యం, స్థానిక సంప్రదాయాలు, అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలతో సమన్వయం వంటి అంశాలు కొన్ని దేశాల వీకెండ్ విధానాలను ప్రభావితం చేశాయి. షార్జాలో మూడు రోజుల వారాంతం ఉద్యోగులకు వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను బట్టి సెలవుల విధానాలు మారవచ్చు.


