భూ రీసర్వే సమయంలో రైతులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలి
వైరా మండలం మేడిబండ రెవెన్యూ గ్రామంలో రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
ఖమ్మం, అక్టోబర్- 15:
ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి
గురువారం వైరా మండలం మేడిబండ రెవెన్యూ గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు. రీ సర్వే మొత్తం ప్రక్రియ పూర్తిగా క్షేత్ర స్థాయిలో భూ హక్కుదారుని సమక్షంలో నిర్వహించి, రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు అపోహలకు గురికాకుండా అధికారులు అందించే సమాచారాన్ని నమ్మకంతో భూ రీ-సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని రైతులను కోరారు.
సర్వే ప్రక్రియలో సంబంధిత భూముల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ, రికార్డుల ప్రకారం సర్వే పనులు చేపట్టాలని తెలిపారు.
సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, వివరాలను గ్రామ పంచాయతీ, తహసీల్దారు కార్యాలయాలలో నోటీస్ బోర్డులో ఉంచాలని, అభ్యంతరాలకు గడువు ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం లో వైరా తహసీల్దారు సురేష్, సంబంధిత అధికారులు, రైతులు, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు.


