కోదాడ, అక్టోబర్ 15 (ఆర్యాద్వి): కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూర్యాపేట జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావంతో రైతాంగం తీవ్ర కష్టాలు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తే అవి కళ్లెదుటే ఎండిపోతుంటే గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
పంటలను కాపాడుకునేందుకు రైతులు వాటర్ ట్యాంకర్లు, జనరేటర్లు తెచ్చుకుని నానా తంటాలు పడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదన్నారు. రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1000 చొప్పున ఇస్తామన్న హామీ గాలికి కొట్టుకుపోయిందని మండిపడ్డారు.
ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసి విలాసాలు, విదేశీ పర్యటనలు, ఫుట్ బాల్ మ్యాచ్ ల కోసం వందల కోట్లు వృథా చేస్తోందని ఆరోపించారు.
ప్రధాన డిమాండ్లు:
1. కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.
2. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి నష్టపరిహారం అందించాలి.
3. ఉపాధి కోల్పోయిన రైతు కూలీలకు కరువు భత్యం అందించాలి.
డిమాండ్లు నెరవేర్చకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారూ.


