Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం: మంత్రి పొంగులేటి

Author
Posted By ARYADVI NEWS
| 30 Aug 2026, 08:05 AM | TELANGANA
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం: మంత్రి పొంగులేటి

సూర్యాపేట: గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూముల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

సూర్యాపేటలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో శనివారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, సర్వే, గృహ నిర్మాణ శాఖల సమీక్ష సమావేశానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సుమారు 125 ఏళ్ల క్రితం భూ సర్వే జరిగిందని, ఆ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో సర్వే జరగలేదని తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 70 గ్రామాల్లో భూ సర్వే చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. సర్వే ప్రక్రియ ఎలా కొనసాగుతోందో తెలుసుకునేందుకు వివిధ జిల్లాల్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో నేరుగా సమీక్షిస్తున్నామని చెప్పారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులపై అవసరమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి

ఇవి కూడా చదవండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పొంగులేటి తెలిపారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. తొలి విడత ఇళ్లకు సంబంధించి ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

పేదల పక్షాన తమ ప్రభుత్వం పనిచేస్తోందని, వారి అభివృద్ధికి అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

70 ఏళ్ల సీలింగ్‌ భూముల సమస్యకు పరిష్కారం

తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్‌, మద్దిరాల మండలాల్లో 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీలింగ్‌ భూముల సమస్యను పరిష్కరించి శనివారం రైతులకు పట్టాలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. జన్నారెడ్డి వంశపారంపర్యానికి సంబంధించిన 2,300 ఎకరాలకు పైగా భూముల సమస్యకు పరిష్కారం చూపించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తదితరులు పాల్గొన్నారు.