*వార్డు సభ్యులందరికీ త్వరలో బీమా: బెల్లంకొండ రవి*
*అనంతగిరి అక్టోబర్ 17( ఆర్యాద్వి):* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామపంచాయతీ సిబ్బందికి వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అనంతగిరి మండలంలోని పాలారం గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి రూ.15 లక్షల కవరేజ్తో కూడిన బీమాను శుక్రవారం పాలారం పోస్టాఫీసులో ప్రారంభించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టల్ శాఖ ద్వారా ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మట్టపల్లి నరేష్, గ్రామ కార్యదర్శి వెంకటేష్, ఎన్నారై రవి ఫౌండేషన్ చైర్మన్ బెల్లంకొండ రవి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మట్టపల్లి రామకోటయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నారై రవి ఫౌండేషన్ చైర్మన్ బెల్లంకొండ రవి మాట్లాడుతూ... గ్రామపంచాయతీ సిబ్బందితో పాటు గ్రామానికి సేవ చేస్తున్న వార్డు సభ్యులందరికీ కూడా తమ ఫౌండేషన్ తరఫున వ్యక్తిగత ప్రమాద బీమా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సేవా కార్యక్రమాల్లో తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
సర్పంచ్ మట్టపల్లి నరేష్ మాట్లాడుతూ గ్రామ సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం అభినందనీయమని, వార్డు సభ్యులకు బీమా కల్పిస్తున్న బెల్లంకొండ రవి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


